వైకల్యం తన కలలకు అడ్డంకి కాదని నిరూపించిన ఉపాధ్యాయుడు జామి సింహాచలం నాయుడు జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిసెట్టిపాలెం గ్రామానికి చెందిన సింహాచలం నాయుడు రెండు చేతులు, ఎడమ కాలికి వైకల్యంతో జన్మించారు.
చిన్నతనంలో ఇతర పిల్లలు చేతులతో ఆడుకుంటుంటే, సింహాచలం మాత్రం తన కాళ్లనే ఆధారంగా చేసుకున్నారు. ఆయన బాబాయి, తెలుగు ఉపాధ్యాయుడు జామి నరసింగరావు ప్రోత్సాహంతో కాళ్ల వేళ్ల మధ్య సుద్దముక్క పట్టుకుని అక్షరాలు రాయడం ప్రారంభించారు. క్రమంగా కాళ్లతో తెలుగు అక్షరాలు రాయడం నేర్చుకున్నారు.
గనిసెట్టిపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదువు ప్రారంభించిన ఆయన, తర్వాత అమీన్ సాహెబ్‌పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. పదో తరగతి పరీక్షల్లో స్క్రైబ్ సహాయం తీసుకోకుండా స్వయంగా కాళ్లతో రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
ఆ తర్వాత ఇంటర్మీడియట్‌లో 888 మార్కులు, డి.ఎడ్‌లో 82 శాతం, డిగ్రీలో 63 శాతం, బీఈడీలో 75 శాతం సాధించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో స్వీయ అధ్యయనం చేసి డీఎస్సీకి సిద్ధమయ్యారు.
2019 తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆయన, టెట్‌లో మంచి మార్కులు సాధించి, మెగా డీఎస్సీ ద్వారా ఓపెన్ కేటగిరీలో ఎస్జీటీగా ప్రభుత్వ ఉద్యోగం పొందారు.
ప్రస్తుతం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఒకప్పుడు తన జీవితాన్ని రాయడానికి ఉపయోగించిన కాళ్లతోనే ఇప్పుడు మరో తరం భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు.
చేతులు లేకున్నా పట్టుదలతో విజయం.. కాళ్లతో రాసి టీచర్‌గా ఎదిగిన సింహాచలం నాయుడు
1
Published: 📅
Reported by: 🖊
Banu Prakash