గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో మహిళల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. షీ టీమ్స్ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెద్ద సంఖ్యలో ఈవ్‌టీజర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
సెప్టెంబర్ 14న వినాయక చవితి ప్రారంభం నుంచి సెప్టెంబర్ 23న నవరాత్రులు ముగిసే వరకు షీ టీమ్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఖైరతాబాద్, బాలాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ పందిళ్లతో పాటు నిమజ్జన మార్గాల్లో కూడా మఫ్టీలో నిఘా ఏర్పాటు చేశారు.
ఈ డ్రైవ్‌లో మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడిన 1,530 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అదుపులోకి తీసుకున్న వారిలో 724 మంది యువకులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. మహిళలను తీవ్రంగా వేధించిన 48 మందికి కోర్టు శిక్ష విధించినట్లు అధికారులు వెల్లడించారు.
వినాయక నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు తదితర ప్రాంతాల్లో మహిళల భద్రతపై షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి పెట్టాయి. వేడుకల సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని షీ టీమ్స్ హెచ్చరించింది.
గణపతి నవరాత్రుల్లో షీ టీమ్స్ స్పెషల్ డ్రైవ్.. 1,530 మంది ఈవ్‌టీజర్లు అదుపులోకి
0