హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఖాజాగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ మార్పులు అమలు కానున్నాయి. నీటి పైపులైన్ పనులు సజావుగా కొనసాగేందుకు తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ఆంక్షలు ఈ నెల 26 నుంచి 60 రోజుల పాటు కొనసాగనున్నాయి.
ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కిమ్స్ ఆస్పత్రి వైపు నుంచి నానక్‌రామ్‌గూడ రోడ్డువైపు వెళ్లే సర్వీస్ రోడ్, ఫ్రీ లెఫ్ట్ మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తారు. అలాగే బయోడైవర్సిటీ వైపు నుంచి నానక్‌రామ్‌గూడ రోడ్డుకు వచ్చే వాహనాలకు రైట్ టర్న్‌ను నిలిపివేయనున్నారు.
వాహనదారుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. షేక్‌పేట ఫ్లైఓవర్ నుంచి ఖాజాగూడ వైపు వచ్చే వాహనాలు కిమ్స్ ఆస్పత్రి ముందు నుంచి టింబర్‌లేక్ కాలనీ రోడ్డు మీదుగా నానక్‌రామ్‌గూడ రోడ్డుకు చేరుకోవాలని తెలిపారు.
గచ్చిబౌలి, బయోడైవర్సిటీ లెవల్-1 ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలు పక్వాన్ యూటర్న్ వద్ద మళ్లించి ఖాజాగూడ లేక్ రోడ్ మీదుగా ఖాజాగూడ వైపు వెళ్లవచ్చని సూచించారు.
ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
ఖాజాగూడ జంక్షన్‌లో 60 రోజుల ట్రాఫిక్ ఆంక్షలు.. పైపులైన్ పనులతో వాహనాల దారి మళ్లింపు
4