హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతపై టీజీ సేఫ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆహార కల్తీ, నాణ్యత ప్రమాణాల పరిశీలనలో భాగంగా గురువారం నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో కొన్ని హోటళ్ల కిచెన్‌లలో అపరిశుభ్ర పరిస్థితులు బయటపడ్డాయి. వంటశాలల్లో డ్రైనేజీ సమస్యలు, దోమలు, ఎలుకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేయకుండా ఉంచినట్లు తనిఖీల్లో వెల్లడైంది.
గచ్చిబౌలిలోని గర్ల్‌ఫ్రెండ్ మందీ, గోపనపల్లిలోని శ్రీకృష్ణ ఫ్యామిలీ దాబా, పుప్పాలగూడలోని నెక్సార్ హోలిఫిష్ ఫుడ్స్, ఆస్పీ హాస్పిటాలిటీ, సీజన్స్ ఎక్స్‌ప్రెస్, సాయిమెస్, లక్కీ రెస్టారెంట్ తదితర పలు సంస్థల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా అధికారులు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. ఆహార భద్రత నిబంధనలు పాటించని హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
హోటల్ నిర్వాహకులు పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం, వంటశాలలను శుభ్రంగా నిర్వహించడం, ఆహార నిల్వలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అధికారులు సూచించారు. ఆహార నాణ్యతపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్ హోటళ్లలో టీజీ సేఫ్ దాడులు.. కిచెన్‌లలో బొద్దింకలు, ఎలుకలు, అపరిశుభ్ర పరిస్థితులు
12