హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే మహాగణపతికి సమర్పించే లడ్డూకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాధారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో గణేశుడి లడ్డూలకు వేలం నిర్వహిస్తారు. కానీ ఖైరతాబాద్ గణేశుడి లడ్డూను ఎలాంటి వేలం లేకుండా భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడికి భారీ లడ్డూను ప్రసాదంగా సమర్పిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని తాపేశ్వరంలోని శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ యూనిట్స్ యజమాని పి.వి.వి.ఎస్. మల్లికార్జున రావు 2010లో ప్రారంభించారు. అప్పట్లో 500 కిలోల లడ్డూను సమర్పించగా, అప్పటి నుంచి ప్రతి ఏడాది వివిధ పరిమాణాల్లో లడ్డూలను అందిస్తున్నారు.
ఈ ఏడాది సుమారు 50 కిలోల బరువున్న లడ్డూను ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించారు. ఈ లడ్డూ తయారీ ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. తాపేశ్వరంలోని సురుచి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో దీనిని తయారు చేస్తారు. స్వచ్ఛమైన నెయ్యితో, ఎలాంటి కృత్రిమ పదార్థాలు ఉపయోగించకుండా లడ్డూను సిద్ధం చేస్తారు. తయారీలో పాల్గొనే కళాకారులు గణపతి దీక్ష పాటిస్తూ ప్రత్యేక వస్త్రధారణతో ఉంటారు.
గణేశుడి నిమజ్జనం అనంతరం ఈ లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. ఈ సంప్రదాయమే ఖైరతాబాద్ గణేశుడి లడ్డూకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. లడ్డూతో పాటు మహా గణపతి మెడలో వేసిన రుద్రాక్ష మాలలోని రుద్రాక్షలను కూడా భక్తులకు పంపిణీ చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ
3