తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం రవాణా వ్యవస్థను మరింత పర్యవేక్షణలోకి తీసుకురావడానికి పౌర సరఫరాల సంస్థ చర్యలు ప్రారంభించింది. ధాన్యం రవాణా చేసే వాహనాలకు అమర్చిన జీపీఎస్ పరికరాలను వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్(వీఎల్‌టీఎస్)తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రక్రియ కోసం అర్హత, అనుభవం కలిగిన సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఆన్‌లైన్ బిడ్లను ఆహ్వానిస్తూ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీపీఎస్ పరికరాలను వీఎల్‌టీఎస్‌తో అనుసంధానం చేయడం ద్వారా ధాన్యాన్ని రవాణా చేసే వాహనాలు ఎప్పుడు, ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా ధాన్యం సేకరణలో వినియోగిస్తున్న ఓపీఎంఎస్ (స్టేట్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్)తో కూడా ఈ వ్యవస్థను అనుసంధానం చేయనున్నారు. దీంతో ధాన్యం రవాణా ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పర్యవేక్షించడం, నిర్వహించడం సులభం కానుంది.
ఎంపికైన సర్వీస్ ప్రొవైడర్ 2026 అక్టోబరు 1 నుంచి 2029 సెప్టెంబరు 30 వరకు సేవలు అందించాల్సి ఉంటుంది. సాంకేతికంగా అర్హత సాధించిన బిడ్డర్లలో అత్యల్ప ఎల్-1 బేస్ ఫర్ ట్రిప్ రేటును కోట్ చేసిన సంస్థను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో ఆర్‌ఎఫ్‌పీ అందుబాటులో ఉంచినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ధాన్యం రవాణాలో పారదర్శకత పెంచేందుకు ఈ సాంకేతిక విధానం ఉపయోగపడనుంది.
ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్.. వీఎల్‌టీఎస్, ఓపీఎంఎస్‌తో అనుసంధానం
0