ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సాయిప్రసాద్ సహా ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం, పలు జిల్లాల్లో జలమయమైన నివాస ప్రాంతాలు, పంటల నష్టంపై వివరాలు తెలుసుకున్నారు.
ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత ఐదు రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరాంధ్రలో నదుల ప్రవాహాలు, ముంపు పరిస్థితులను మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలపై ఇరిగేషన్ అధికారులు వివరాలు అందించారు. హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్‌కు తరలించేలా లిఫ్ట్ పనులను పూర్తి చేయాలని సూచించారు. పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా అధికారులతో చర్చించారు.
కృష్ణానదిలో ఎగువ నుంచి పెద్దగా ప్రవాహాలు లేకపోయినా, స్థానికంగా వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. స్థానిక వరద నీటిని నిల్వ చేసుకునేందుకు ప్రకాశం బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
తాజా వర్షాల కారణంగా రాష్ట్రంలో వర్షపాతం లోటు తగ్గిందని అధికారులు వివరించారు. ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి వరద ప్రవాహాలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
వరదల వేళ సీఎం చంద్రబాబు కీలక ఆదేశం.. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం
1
Published: 📅
Reported by: 🖊
Sarika Sk