మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసు శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. డ్రగ్స్ నియంత్రణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు జాతీయ పురస్కారం దక్కింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్య నిరోధక విభాగాల మూడో జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ ఫోర్స్‌ను అభినందించారు. ఈ జాతీయ పురస్కారం తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ గుర్తింపు నిదర్శనమని తెలిపారు.
2029 డిసెంబరు నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ మరింత దృఢ సంకల్పంతో పనిచేయాలని సీఎం ఆకాంక్షించారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ విక్రయం, వినియోగంపై ఎలాంటి సమాచారం ఉన్నా సంబంధిత అధికారులకు అందించాలని సీఎం సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.
నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ముందుండాలని సీఎం ఆకాంక్షించారు. డ్రగ్స్ నియంత్రణలో పోలీసు శాఖతో పాటు సమాజంలోని అన్ని వర్గాల సహకారం అవసరమని పేర్కొన్నారు.
డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు జాతీయ పురస్కారం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
0