తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వృక్షాలు నేలకూలిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైటెక్ బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్ రహదారులపైకి నీరు చేరింది. అనపర్తి-పొలమూరు రోడ్డులో ఎర్ర కాలువ వంతెన వద్ద చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిడదవోలు పరిసరాల్లో ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది.
విశాఖపట్నంలో గాజువాక, పెదగంట్యాడ మండలాల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కుంచుమాంబ కాలనీ, నాతయ్యపాలెం, హౌసింగ్ బోర్డు కాలనీ, షీలానగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కాకినాడ జిల్లాలో ఏలేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఇన్‌ఫ్లో పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాళ్లరేవు మండలంలో మట్టి గోడ కూలి ఓ బాలుడు మృతి చెందిన ఘటన నమోదైంది.
ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు వరద నీటిని కృష్ణానదిలోకి విడుదల చేశారు. పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఏపీలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు
5
Published: 📅
Reported by: 🖊
Kanakadri