దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి-నర్సాపూర్ మార్గంలో 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సమయంలో ప్రయాణికులకు అదనపు సౌకర్యం కల్పించేందుకు ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సిటీ పరిధిలోని చర్లపల్లి నుంచి నర్సాపూర్ మధ్య ఈ ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయి. అక్టోబరు 4 నుంచి నవంబరు 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు నర్సాపూర్ నుంచి 07062 ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. అలాగే అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకు ప్రతి సోమవారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి 07063 ప్రత్యేక రైలు బయల్దేరనుంది.
ఈ ప్రత్యేక రైళ్లకు మార్గమధ్యంలో పలు ముఖ్యమైన స్టేషన్లలో హాల్ట్ సదుపాయం కల్పించారు. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు అవకాశం ఉంటుంది.
దసరా సెలవుల సమయంలో స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి. రద్దీని నియంత్రించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది.
దసరా రద్దీకి ప్రత్యేక రైళ్లు.. చర్లపల్లి-నర్సాపూర్ మార్గంలో 18 సర్వీసులు
8