లగచర్ల కేసులో విచారణ ఖైదీకి సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై సంగారెడ్డి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో విచారణ ఖైదీగా ఉన్న జర్పుల హీరియా నాయక్ (ఖైదీ నం.44) ఛాతీ నొప్పితో బాధపడటంతో అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఖైదీ చేతులకు బేడీలు, లీడింగ్ చైన్ వేసిన దృశ్యాలు ప్రసార సాధనాల్లో కనిపించడంతో జైళ్ల శాఖపై విమర్శలు వచ్చాయి.
ఈ ఘటన జైలు పరిపాలనా వ్యవస్థకు మచ్చ తెచ్చిందని జైళ్ల శాఖ డీజీ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో సంతోష్ కుమార్ రాయ్‌పై తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్-1991 ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు.
డీజీ నివేదిక ఆధారంగా జారీ చేసిన చార్జ్ మెమోకు సూపరింటెండెంట్ ఇచ్చిన వివరణపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సీసీఏ రూల్స్‌లోని 20(5) నిబంధన ప్రకారం పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
విచారణ అధికారిగా జైళ్ల శాఖ ఐజీ రాజేశ్‌ను, ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించే అధికారిగా వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్ కుమార్‌ను నియమించారు. సంబంధిత రికార్డులను విచారణాధికారికి అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. రెండు నెలల్లోగా విచారణ నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
లగచర్ల కేసులో ఖైదీకి సంకెళ్లు.. జైలు సూపరింటెండెంట్‌పై శాఖాపరమైన విచారణ
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri