బిహార్‌లోని జముయి జిల్లాలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొడుకుపై నమోదైన కేసు దర్యాప్తులో తండ్రి పాత నేర చరిత్ర బయటపడింది. పదో తరగతి విద్యార్థిపై రోడ్డుపై దాడి చేయడం, అతడి స్నేహితురాలైన బాలికను వేధించిన కేసులో నందన్ యాదవ్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
నందన్ యాదవ్ కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించిన పోలీసులకు అతడి తండ్రి గనోరి యాదవ్‌పై ఉన్న పాత కేసు విషయం తెలిసింది. 2003 ఏప్రిల్ 3న ప్రతాప్‌పుర్‌లో జరిగిన జంట హత్య కేసులో గనోరి యాదవ్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపార వివాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైన ఘటనలో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదైంది.
అయితే కేసు నమోదైన తర్వాత గనోరి యాదవ్ అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా తప్పించుకుని తిరుగుతున్న అతడి కోసం పోలీసులు మళ్లీ గాలింపు చేపట్టారు. చివరకు అతడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
కొడుకుపై నమోదైన ప్రస్తుత కేసు దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ పాత హత్య కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కొడుకు అరెస్ట్‌తో వెలుగులోకి తండ్రి నేర చరిత్ర.. 20 ఏళ్ల తర్వాత హత్య కేసులో అరెస్ట్
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk