టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారత మాజీ స్టార్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ తప్పుకోవడంతో.. ప్రస్తుతం ఓజా తాత్కాలికంగా సెలక్షన్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ఆయనే పూర్తిస్థాయి చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం.
గువాహటిలో భారత కోచ్ గౌతమ్ గంభీర్‌తో జరిగిన కీలక సమావేశంలో ప్రజ్ఞాన్ ఓజా పాల్గొనడం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం కల్పించింది. వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు బర్సాపరా స్టేడియంలో ఈ సమావేశం జరిగింది. ద్వైపాక్షిక సిరీస్ సమయంలో సెలక్షన్ కమిటీ మొత్తం సమావేశం కావడం అరుదుగా జరుగుతుండటంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. భారత్ తదుపరి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో జట్ల ఎంపిక, ఆటగాళ్లపై చర్చించేందుకే ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
భారత్ తరఫున 24 టెస్టులు ఆడిన ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత బీసీసీఐ సెలక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్నారు. అగార్కర్ తప్పుకోవడంతో తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. రాబోయే రోజుల్లో సెలెక్టర్లకు పని భారం పెరగనుంది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జట్టు కాంబినేషన్లు, ఆటగాళ్ల ఫిట్‌నెస్, అందుబాటులో ఉన్న ఆటగాళ్లపై సెలెక్టర్లు దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా!
0
Published: 📅
Reported by: 🖊
Banu Prakash