అరేబియా సముద్రంలో భారత కోస్టు గార్డు భారీ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుంది. సెప్టెంబర్ 25న పడవలో సుమారు రూ.3 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు పాకిస్థానీలు పట్టుబడ్డారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా కోస్టు గార్డు అధికారులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. అనంతరం గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.
లక్షద్వీప్‌కు పశ్చిమాన అనుమానాస్పదంగా కనిపించిన పడవను అధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పడవను సీజ్ చేసి తనిఖీలు నిర్వహించగా హెరాయిన్, మెతాంఫిటమీన్ ఉన్నట్లు కోస్టు గార్డు తెలిపింది. పట్టుబడిన ఐదుగురు నిందితులను ముంబైకి తరలించారు. వివిధ దేశాలకు విస్తరించిన డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను అడ్డుకునే చర్యల్లో భాగంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
గగనతలం, సముద్రంపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తున్నట్లు కోస్టు గార్డు తెలిపింది. సముద్ర మార్గం ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు భద్రతా దళాలు నిఘాను మరింత పెంచుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో కూడా కోస్టు గార్డు, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌తో కలిసి నిర్వహించిన మరో ఆపరేషన్‌లో 307 కిలోల మాదకద్రవ్యాలను సీజ్ చేసినట్లు నివేదిక పేర్కొంది.
భారత కోస్టు గార్డు ఆపరేషన్.. రూ.3 వేల కోట్ల డ్రగ్స్ సీజ్
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk