CBSE మూడు భాషల విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు కీలక స్పష్టత ఇచ్చింది. మూడో భాష R3కు పదో తరగతిలో బోర్డు పరీక్ష లేకపోయినా, పాఠశాల అంతర్గత మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని తెలిపింది.
2026-27లో తొమ్మిదో తరగతిలో చదువుతున్న ప్రతి విద్యార్థి మూడు భాషలను అభ్యసించాలి. వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. హిందీ, తెలుగు, తమిళం, సంస్కృతం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, ఒడియా, అస్సామీ వంటి భాషలను భారతీయ భాషలుగా పేర్కొంది.
ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, అరబిక్, స్పానిష్ వంటి భాషలు నాన్ నేటివ్ భాషలుగా పరిగణించబడతాయి. ఒక భారతీయ భాష, ఒక నాన్ నేటివ్ భాష చదివే విద్యార్థి R3గా మరో భారతీయ భాషను తీసుకోవాలి.
ప్రస్తుత 2026-27 పదో తరగతి బ్యాచ్‌కు ఎలాంటి మార్పు లేదు. ఈ విద్యార్థులు పాత రెండు భాషల విధానంలోనే చదువుతారు. వారికి మూడో భాష అవసరం లేదు.
2026-27 తొమ్మిదో తరగతి బ్యాచ్ 2027-28లో పదో తరగతికి చేరినప్పుడు R3కు CBSE బోర్డు పరీక్ష ఉండదు. పాఠశాలే వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం, ప్రాజెక్టు వర్క్ వంటి అంశాల ఆధారంగా విద్యార్థులను మూల్యాంకనం చేస్తుంది.
R3లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థికి పాస్ సర్టిఫికెట్ జారీ చేయడానికి ముందు మరోసారి మూల్యాంకనం నిర్వహించాలి. ఈ రీఅసెస్‌మెంట్ పదో తరగతి ఫలితాల ప్రకటనకు ముందే పూర్తిచేయాలని సూచించింది.
తొమ్మిదో తరగతిలో R3 మూల్యాంకనం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. వినడం, మాట్లాడే నైపుణ్యాలకు 40 మార్కులు, సృజనాత్మక రచనకు 15 మార్కులు, పఠనం, రచనకు 30 మార్కులు, ప్రాజెక్టుకు 15 మార్కులు కేటాయించారు.
NCERT తొమ్మిదో తరగతి R3 అభ్యాస వనరులను తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పాఠశాలలు ఈ వనరులను ఉపయోగించి బోధన, మూల్యాంకనం నిర్వహించాలి.
కొత్త విధానం అమలులో ఉపాధ్యాయుల కొరత ఎదురైతే రిటైర్డ్ ఉపాధ్యాయులు, భాషా నిపుణులు, ఇతర CBSE పాఠశాలలతో భాగస్వామ్యం, ఆన్‌లైన్ తరగతులను ఉపయోగించుకోవచ్చని బోర్డు సూచించింది.
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు, విదేశాల్లోని CBSE పాఠశాలలు, విదేశీ విద్యార్థులకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి పెంచడం కాకుండా, బహుభాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఈ విధానం లక్ష్యమని CBSE పేర్కొంది.
R3 స్కూల్ అసెస్‌మెంట్‌లో పాస్ అయితేనే పదో తరగతి సర్టిఫికెట్
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan