దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం సూచీలకు బలం ఇచ్చాయి. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్ భావనపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో భాజపా విజయం దిశగా దూసుకెళ్తుందన్న సమాచారం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
సెన్సెక్స్ 77,257.27 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఒక దశలో 77,910.75 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. అయితే ఆ తర్వాత లాభాలు కొంత తగ్గాయి. చివరికి సెన్సెక్స్ 355.90 పాయింట్ల లాభంతో 77,269.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 121.75 పాయింట్లు పెరిగి 24,119.30 వద్ద ముగిసింది.
మార్కెట్ లో ప్రారంభ ఉత్సాహం బలంగా కనిపించినా చివరికి మోస్తరు లాభాలకే సూచీలు పరిమితం కావడం గమనార్హం. ఇది పెట్టుబడిదారులు ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సూచిస్తోంది. రాజకీయ ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ ముడి చమురు ధరలు మరియు రూపాయి బలహీనత మార్కెట్ పై ఒత్తిడిగా మారుతున్నాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ 95.08 వద్ద రికార్డు కనిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 113 డాలర్ల వద్ద ఉండగా బంగారం ఔన్సు 4545 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ముప్పై సూచీలో అదానీ పోర్ట్స్ హిందుస్థాన్ యూనిలీవర్ రిలయన్స్ ఎల్ అండ్ టీ ఎటర్నల్ షేర్లు రాణించాయి. భారతీ ఎయిర్ టెల్ కోటక్ మహీంద్రా బ్యాంక్ టీసీఎస్ ఐటీసీ ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్ లాభాల్లో ముగిసినా రూపాయి పతనం ఇప్పుడు పెద్ద హెచ్చరికగా మారింది.
ఎన్నికల సెంటిమెంట్ మార్కెట్లను ఉత్తేజపరచడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిశాయి.
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan