గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మీ సేవ కేంద్రాల్లో సర్వర్ సమస్యలు విద్యార్థులు, సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు సర్వర్ అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చిన వారు గంటల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది.
ముఖ్యంగా 2026-27 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలకు వెళ్తున్నారు. స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ముందుగా మీ సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అయితే వారం రోజులుగా మీ సేవ కేంద్రాల్లో బయోమెట్రిక్ సర్వర్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 25 కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని కేంద్రాలకు వస్తున్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు వేచి చూసినా సర్వర్ పనిచేయకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై మీ సేవ సిబ్బందిని అడిగితే తమకు పూర్తి సమాచారం లేదని, పైస్థాయి నుంచి పరిష్కారం వచ్చిన తర్వాతే సేవలు అందించగలమని చెబుతున్నారని విద్యార్థులు తెలిపారు.
స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
మీ సేవ సర్వర్ డౌన్.. స్కాలర్‌షిప్ దరఖాస్తుల కోసం విద్యార్థుల ఇబ్బందులు
0