జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లో హాజరు విధానంలో కొత్త మార్పులు తీసుకురానున్నారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హాజరు నమోదు ఇకపై మరింత పక్కాగా ఉండేలా ఫేస్ రికగ్నిషన్ ఆధారిత అటెండెన్స్ సిస్టమ్‌ను అమలు చేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
వీసీ కిషన్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు విధానంపై అధికారులు దృష్టి సారించారు. బుధవారం కొన్ని సాంకేతిక సంస్థలతో చర్చలు జరిపిన అనంతరం ఆధునిక విధానాలను అమలు చేస్తున్న కన్జార్టియంకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.
జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న 11 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు 250కి పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కళాశాలల్లో ఈ వ్యవస్థను మూడు దశల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మొదటి దశలో జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌తో పాటు సుల్తాన్‌పూర్, మంథని, జగిత్యాల, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్, వనపర్తి, కోస్గి ఇంజనీరింగ్ కాలేజీలు, సుల్తాన్‌పూర్ ఫార్మసీ కళాశాల, క్యాంపస్‌లోని మేనేజ్‌మెంట్ కళాశాలలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
రెండో దశలో ప్రైవేట్ అటానమస్ కళాశాలలకు, మూడో దశలో ప్రైవేట్ అఫిలియేటెడ్ కళాశాలలకు ఈ వ్యవస్థను విస్తరించనున్నారు. క్లౌడ్ ఆధారిత హాజరు వ్యవస్థ ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదులో జరిగే అవకతవకలను తగ్గించవచ్చని యూనివర్సిటీ అకాడమిక్ అండ్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ కామాక్షి ప్రసాద్ తెలిపారు.
జేఎన్‌టీయూలో ఇక పక్కాగా హాజరు.. విద్యార్థులు, సిబ్బందికి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk