యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో భారతీయుడి హత్య ఘటన సంచలనం సృష్టించింది. కర్ణాటకకు చెందిన ఆల్విన్ ప్రకాశ్ కుందర్ (44) దారుణంగా హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన సోదరుడిని హత్య చేసి, మృతదేహాన్ని 9 ముక్కలుగా చేశారని ఆల్విన్ సోదరుడు అనిల్ ప్రశాంత్ వెల్లడించారు.
ఆల్విన్ ప్రకాశ్ గత 14 సంవత్సరాలుగా షార్జాలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య టీనా అక్కడే స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. జూలై 20న అనిల్ ప్రశాంత్ తన సోదరుడికి ఫోన్ చేయగా, ఆల్విన్ కాల్ ఎత్తకుండా తాను బాగానే ఉన్నానని మెసేజ్ పంపారు. అయితే ఇలాంటి మెసేజ్‌లు సాధారణంగా పంపని ఆల్విన్ ప్రవర్తనపై అనిల్‌కు అనుమానం వచ్చింది.
వారం రోజుల తర్వాత కూడా ఆల్విన్ ఫోన్ స్పందించకపోవడంతో అనిల్ షార్జాలో ఉన్న తన స్నేహితుడిని సంప్రదించారు. అతను ఆల్విన్ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా అది ఖాళీగా కనిపించింది. వాచ్‌మన్‌ను అడగగా ఆల్విన్ భారత్‌కు వెళ్లిపోయారని చెప్పినప్పటికీ, కంపెనీ పాస్‌పోర్ట్ రికార్డులను పరిశీలించగా ఆయన భారత్‌కు వెళ్లలేదని తేలింది.
అనిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఆల్విన్ మృతదేహం 9 ముక్కలుగా కట్ చేసిన స్థితిలో ఓ కారులో లభ్యమైంది. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆల్విన్ భార్య, కుమారుడి ఆచూకీ కోసం కూడా గాలింపు కొనసాగుతోంది.
షార్జాలో దారుణం.. భారతీయుడి హత్య, మృతదేహాన్ని 9 ముక్కలుగా చేసి కారులో పడేశారు
0
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati