దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో హైజాక్ అనుమానాస్పద సంకేతాలు కలకలం రేపాయి. FZ1073 విమానం సౌదీ అరేబియా గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో రెండు అత్యవసర కోడ్‌లను ప్రసారం చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా నివేదికలు వెల్లడించాయి.
వాటిలో ఒక కోడ్ విమానాన్ని హైజాక్ చేసే అవకాశం ఉందన్న సంకేతాన్ని ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమై విమాన పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
హైజాక్ అనుమానాల నేపథ్యంలో FZ1073 విమానాన్ని టెల్ అవీవ్‌కు వెళ్లకుండా సౌదీ అరేబియాకు మళ్లించినట్లు సమాచారం. విమానంలోని అత్యవసర సంకేతాలు ఎందుకు వచ్చాయి? వాటి వెనుక అసలు కారణం ఏమిటి? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
అయితే విమానంలో నిజంగా హైజాక్ ప్రయత్నం జరిగిందా లేదా అత్యవసర సంకేతాలు వేరే కారణంతో పంపించారా అనే విషయంపై అధికారులు ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రయాణికుల భద్రత, ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.
దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ అలర్ట్.. ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ అప్రమత్తం
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk