తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు ఇచ్చారు. రెడ్ అలర్ట్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్లు అప్రమత్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా బుధవారం విద్యా సంస్థలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవు ప్రకటించారు. నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ కొనసాగుతోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య, కలింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉంది.
తుఫాన్ అలర్ట్.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
7
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk