ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, అవసరమైన ఉపశమన చర్యలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఆవరణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ను ఏర్పాటు చేసింది.
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, డైరెక్టర్ మనజీర్ జిలానీ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. రైతుల నుంచి వచ్చే సమస్యలు, సందేహాలకు వేగంగా స్పందించేందుకు ఈ కేంద్రం పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
రైతులు టోల్‌ఫ్రీ నంబర్ 155251కు ఫోన్ చేసి వ్యవసాయానికి సంబంధించిన సూచనలు పొందవచ్చని తెలిపారు. రైతుల కాల్స్‌కు సమాధానం ఇవ్వడంతో పాటు వాతావరణ పరిస్థితులు, పంటలపై ప్రభావం వంటి అంశాలపై సమాచారం అందిస్తున్నట్లు సీసీసీ సిబ్బంది ఉన్నతాధికారులకు వివరించారు.
శాటిలైట్ ఆధారిత హెచ్చరికలను కూడా జారీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, వర్షపాతం పరిస్థితులు రైతులపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు సమాచారం అందించడం ద్వారా నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రైతులకు సరైన సమయంలో సలహాలు, సూచనలు అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడనుంది.
ఎల్‌నినో ప్రభావంపై రైతులకు భరోసా.. ఏపీలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
6
Published: 📅
Reported by: 🖊
Kanakadri