జమ్మూకశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ప్రయాణించింది. శ్రీమాత వైష్ణోదేవి కత్రా-బనిహాల్ సెక్షన్‌లో నార్తర్న్ రైల్వే నిర్వహించిన ఈ పరీక్షతో ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి నమోదైంది.
కత్రా-బనిహాల్ సెక్షన్ కశ్మీర్ లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో నిరంతర రైలు మార్గం ద్వారా అనుసంధానించడంలో అత్యంత కీలకమైన భాగం. ఈ మార్గంలో గతంలో రైళ్లకు గంటకు 75 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితి ఉండగా, సాంకేతిక పరిశీలనల అనంతరం వేగాన్ని 100 కిలోమీటర్లకు పెంచేందుకు అనుమతి ఇచ్చారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో అధిక వేగంతో విజయవంతంగా ప్రయాణించడం రైల్వే మౌలిక వసతుల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాలు, సొరంగాలు, క్లిష్ట భౌగోళిక పరిస్థితులతో కూడిన కత్రా-బనిహాల్ మార్గంలో ఈ వేగం సాధించడం విశేషంగా నిలిచింది.
చినాబ్ బ్రిడ్జితో పాటు ఈ సెక్షన్‌లో అనేక సొరంగాలు, ఇంజినీరింగ్ నిర్మాణాలు ఉన్నాయి. వేగ పరిమితి పెరగడంతో ప్రయాణికులు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే కశ్మీర్ లోయకు రైలు కనెక్టివిటీ మరింత వేగవంతమై, పర్యాటకం, వాణిజ్యం, స్థానిక రవాణాకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
చినాబ్ బ్రిడ్జిపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన వందే భారత్
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan