అమెరికాలో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆధ్వర్యంలోని ఫిలడెల్ఫియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో కీలక సమాచార ప్రసార వ్యవస్థ దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ప్రాథమిక కమ్యూనికేషన్ లైన్ పనిచేయకపోవడంతో వ్యవస్థ బ్యాకప్ లైన్‌కు మారేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో న్యూజెర్సీలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా బ్యాకప్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా తెగిపోయింది. దీంతో విమాన నియంత్రణ వ్యవస్థపై ప్రభావం పడింది.
ఈ సాంకేతిక సమస్య కారణంగా ఎఫ్‌ఏఏ తాత్కాలికంగా వందల సంఖ్యలో విమాన సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. అమెరికా వ్యాప్తంగా దాదాపు 7,000 విమానాలు ఆలస్యం లేదా రద్దు అయ్యాయి. న్యూయార్క్ ప్రాంతంలోని మూడు ప్రధాన విమానాశ్రయాల్లోనే సుమారు 1,400 విమానాలు ప్రభావితమయ్యాయి.
ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ అంతరాయం ఏర్పడటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. వివిధ దేశాల అధినేతలు, మంత్రులు న్యూయార్క్‌కు చేరుకుంటున్న సమయంలో ప్రధాన విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో విమాన సేవలకు భారీ అంతరాయం.. కమ్యూనికేషన్ కేబుల్ తెగడంతో వేల విమానాలు ఆలస్యం
0
Published: 📅
Reported by: 🖊
Kanakadri