స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ తొలిసారిగా భూ కక్ష్యలోకి విజయవంతంగా చేరి కీలక మైలురాయిని సాధించింది. సెప్టెంబర్ 28న టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి ప్రయోగించిన స్టార్‌షిప్ 14వ పరీక్షా ప్రయోగంలో 26 కొత్త తరం స్టార్‌లింక్ V3 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇవి స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లో చేరనున్నాయి.
ప్రయోగం ప్రారంభమైన తర్వాత స్టార్‌షిప్‌లోని ఆరు ఇంజిన్లలో ఒకటి ముందుగానే పనిచేయడం ఆపివేసింది. దీంతో తొలుత కక్ష్యలోకి వెళ్లే ప్రయత్నాన్ని నిలిపివేయాలని స్పేస్‌ఎక్స్ భావించింది. అయితే డేటాను పరిశీలించిన అనంతరం మిషన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. చివరకు స్టార్‌షిప్ కక్ష్యను చేరుకుని 26 స్టార్‌లింక్ V3 ఉపగ్రహాలను విజయవంతంగా విడుదల చేసింది.
ఈ మిషన్‌ను తొలుత సుమారు 10 గంటలపాటు కొనసాగించి ఆరు సార్లు భూమి చుట్టూ పరిభ్రమించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే ఇంజిన్ సమస్య కారణంగా ప్రయోగాన్ని ముందుగానే ముగించారు. సుమారు మూడు గంటల తర్వాత స్టార్‌షిప్ పసిఫిక్ మహాసముద్రంలో నియంత్రితంగా తిరిగి ప్రవేశించింది.
ఈ ప్రయోగం స్టార్‌షిప్‌కు తొలి విజయవంతమైన ఆర్బిటల్ ఫ్లైట్‌గా నిలిచింది. గత 13 పరీక్షా ప్రయోగాల్లో స్టార్‌షిప్‌ను పూర్తి కక్ష్యలోకి పంపించలేదు. ఈసారి తొలిసారిగా వాణిజ్యపరమైన ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి తీసుకెళ్లింది. భవిష్యత్తులో భారీ ఉపగ్రహ ప్రయోగాలతో పాటు చంద్రుడు, అంగారక గ్రహానికి సంబంధించిన మిషన్లలో స్టార్‌షిప్‌ను ఉపయోగించాలన్నది స్పేస్‌ఎక్స్ లక్ష్యం.
స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ తొలి ఆర్బిటల్ విజయం.. 26 అప్‌గ్రేడెడ్ స్టార్‌లింక్ ఉపగ్రహాలు కక్ష్యలోకి
6
Published: 📅
Reported by: 🖊
Kanakadri