నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వాలని నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అమల్లో ఉన్న అన్ని భద్రతా ప్రోటోకాల్స్, మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని నాని తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.
ఈ విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను గౌరవించినందుకు నానికి అభినందనలు తెలిపారు. ప్రజల భద్రతకు, జనసమూహ నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే యువ తెలంగాణ దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ను కూడా అభినందించారు.
సినిమా ప్రీమియర్ షోకు సంబంధించిన అనుమతుల కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. దరఖాస్తును పరిశీలించిన తర్వాత పోలీసులు నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.
‘ది ప్యారడైజ్’ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాని ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, అవసరమైన అన్ని నిబంధనలు పాటిస్తామని తెలిపారు. అభిమానులు, ప్రేక్షకుల భద్రత దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ పరిణామం మరోసారి గుర్తు చేసింది.
‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోపై నాని విజ్ఞప్తి.. సీఎం రేవంత్ రెడ్డి స్పందన
0