ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన కేటీఆర్, ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే పరమావధిగా జీవించిన ధీశాలి కొండా బాపూజీ అని కొనియాడారు.
స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ప్రారంభమై మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు ప్రత్యేకమైనవని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన విషయాలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే పుట్టిందని, జలదృశ్యం వేదికగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందని గుర్తుచేశారు.
రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించిందని కేటీఆర్ తెలిపారు. అలాగే ఆయన పేరును హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టి స్మరించుకున్నారని పేర్కొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు, ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర చిరస్మరణీయం: కేటీఆర్
3