ఆఫ్రికా దేశం కెన్యాలో టాటా కెమికల్స్ మగాదీ లిమిటెడ్‌పై వివాదం మరింత తీవ్రంగా మారింది. ఆ సంస్థ దేశాన్ని వీడాలని కెన్యా అధ్యక్షుడు విలియమ్ రూటో ఆదేశించారు. టాటా కంపెనీ కొన్నేళ్లుగా కెన్యాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ స్థానిక ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదని ఆయన ఆరోపించారు.
టాటా కెమికల్స్ సోడా యాష్ (సోడియం కార్బొనేట్) ఖనిజాన్ని కేవలం ఎగుమతి చేసుకునేందుకే పరిమితమైందని అధ్యక్షుడు విమర్శించారు. ఈ ఖనిజానికి సంబంధించి స్థానికంగా గాజు లేదా ఇతర కెమికల్ పరిశ్రమలను ఏర్పాటు చేయలేదని, కజియాడో కౌంటీలో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరో రెండు సంస్థలను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.
కెన్యా ప్రభుత్వం రాయల్టీ బకాయిలు, ఎగుమతుల వివరాల్లో అవకతవకలు, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు, స్థానిక అభివృద్ధికి సంబంధించిన ఒప్పందాల అమలులో లోపాలను ప్రస్తావించింది. 100 ఏళ్ల మైనింగ్ కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ కజియాడోలో ఒక్క ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయలేదని అధ్యక్షుడు మండిపడ్డారు.
మరోవైపు టాటా కెమికల్స్ తాము స్థానిక నిబంధనలను పూర్తిగా పాటించామని తెలిపింది. ప్రభుత్వ అభ్యంతరాలకు సంబంధించిన పత్రాలను సమర్పించామని, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. స్థానికులకు నీటి సదుపాయం, రవాణా సబ్సిడీలు, విద్యా సహాయం వంటి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొంది.
సోడా యాష్ గాజు, డిటర్జెంట్లు, ఇతర రసాయనాల తయారీలో ఉపయోగించే కీలక పారిశ్రామిక పదార్థం. టాటా కెమికల్స్ ట్రోనా ఖనిజం నుంచి దీనిని వెలికితీస్తోంది.
కెన్యా అధ్యక్షుడి ఆగ్రహం.. టాటా కెమికల్స్ దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
14
Published: 📅
Reported by: 🖊
Sarika Sk