ప్రకృతి అందాలు ఒక్కోసారి ఊహించని రీతిలో కనువిందు చేస్తుంటాయి. అలాంటి అరుదైన దృశ్యం బ్రెజిల్‌లోని పర్నైబా డెల్టాలో కనిపిస్తోంది. సూర్యాస్తమయ సమయంలో వందలాది ఎర్రటి పక్షులు గుంపులుగా ఎగురుతూ పచ్చని చెట్లపై వాలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పక్షులను స్కార్లెట్ ఐబిస్ అని పిలుస్తారు. స్థానికంగా వీటికి ‘గ్వారోలు’ అనే పేరు కూడా ఉంది. ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఈకలు వీటి ప్రత్యేకత.
రోజంతా ఆహారం కోసం తిరిగే ఈ పక్షులు సాయంత్రం తమ నివాస ప్రాంతాలకు చేరుకుంటాయి. సూర్యాస్తమయ సమయంలో గుంపులుగా ఆకాశంలో ఎగురుతూ మడ అడవుల్లోని చెట్లపై వాలుతుంటాయి.
అస్తమిస్తున్న సూర్యుడి బంగారు కాంతిలో వీటి ఎర్రటి ఈకలు మరింత అందంగా మెరిసిపోతాయి. వందలాది పక్షులు ఒకేసారి చెట్లపై వాలడంతో పచ్చని చెట్లకు ఎర్రటి పూలు పూసినట్లుగా కనిపిస్తుంది.
ముఖ్యంగా బ్రెజిల్ తీర ప్రాంతాల్లోని మడ అడవులు ఈ పక్షులకు ముఖ్యమైన ఆవాసాలుగా ఉన్నాయి. అక్కడి జలచరాలు వీటికి ఆహారంగా ఉపయోగపడతాయి.
అయితే ఈ పక్షులకు ఇంత ఆకర్షణీయమైన ఎరుపు రంగు ఎలా వస్తుందనే విషయం కూడా ఆసక్తికరమే. స్కార్లెట్ ఐబిస్ పక్షులు ప్రధానంగా చిన్న పీతలు, రొయ్యలు, ఇతర జలచరాలను తింటాయి.
వాటి ఆహారంలో ఉండే కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు పక్షుల శరీరంలో చేరి ఈకలకు ప్రకాశవంతమైన ఎరుపు రంగును అందిస్తాయి. ఈ కారణంగానే స్కార్లెట్ ఐబిస్ పక్షులు ఇతర జాతుల పక్షుల కంటే ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ప్రస్తుతం ఈ పక్షులు చెట్లపై వాలుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ప్రకృతి అందాలను ప్రశంసిస్తున్నారు.
కొందరు ఈ దృశ్యాన్ని భూలోక స్వర్గంతో పోలుస్తుండగా, మరికొందరు ప్రకృతి గీసిన అద్భుతమైన చిత్రపటంగా అభివర్ణిస్తున్నారు.
పక్షుల గుంపులు, పచ్చని చెట్లు, సూర్యాస్తమయ కాంతి కలిసిన ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. సహజ ఆవాసాల్లో పక్షుల జీవన విధానం ఎంత అందంగా ఉంటుందో ఈ వీడియో మరోసారి గుర్తుచేస్తోంది.
చెట్లపై ఎర్రటి పూల వర్షం కురిసినట్లుగా.. బ్రెజిల్లో వందలాది పక్షుల అద్భుత దృశ్యం వైరల్!
8
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk