ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత శాఖ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించేందుకు ఈ ఆకస్మిక దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఉన్న 70 హోటళ్లు, రెస్టారెంట్లలో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 25 హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే మరో 15 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంబంధిత యాజమాన్యాలపై మొత్తం 30 కేసులు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
నమోదైన కేసుల్లో 10 కేసులు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకపోవడం కారణంగా నమోదు చేశారు. మిగిలిన కేసులు అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన పదార్థాలను వినియోగించడం వంటి ఉల్లంఘనలకు సంబంధించినవని అధికారులు తెలిపారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా తనిఖీలు కొనసాగిస్తామని ఫుడ్ సేఫ్టీ శాఖ స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలని సూచించింది.
ఈ దాడులకు సంబంధించిన నివేదికను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఆహార భద్రత నిబంధనల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగనున్నట్లు తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
9
Published: 📅
Reported by: 🖊
Sarika Sk