పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘ఆర్నబ్’ తుపాన్ అతి తీవ్రమైన తుపాన్‌గా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ గత ఆరు గంటలుగా గంటకు సుమారు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఆర్నబ్ విశాఖపట్నానికి ఆగ్నేయంగా సుమారు 300 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 360 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 380 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పున 460 కిలోమీటర్లు, బాపట్లకు తూర్పున 530 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది.
మంగళవారం సాయంత్రం వరకు తుపాన్ పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, అనంతరం వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 28 ఉదయానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, కొన్ని సందర్భాల్లో వేగం 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో తుపాన్ షెల్టర్లు సిద్ధం చేశారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా అధికారులు సూచించారు. పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అతి తీవ్ర తుపాన్‌గా మారిన ‘ఆర్నబ్’.. ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్
5
Published: 📅
Reported by: 🖊
Kanakadri