బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాతి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడవచ్చని అంచనా వేసింది.
ఈ వాయుగుండం ఎల్లుండి ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. నేడు, రేపు పలు జిల్లాల్లో చెదురుమదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
అల్లూరి, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలకు అవకాశం
3
Published: 📅
Reported by: 🖊
Sarika Sk