యూరప్‌లో భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డాంలో మైక్రోసాఫ్ట్ నిర్మిస్తున్న డేటా సెంటర్ వద్ద శుక్రవారం నిరసనకారులు ఆందోళన చేపట్టారు. కొందరు నిర్మాణ ప్రాంతంలోకి ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు సుమారు 150 నుంచి 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
భారీ డేటా సెంటర్ల నిర్మాణం వల్ల విద్యుత్తు, నీటి వినియోగం విపరీతంగా పెరుగుతోందని పర్యావరణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక వనరులపై ఒత్తిడి పెరగడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో డేటా సెంటర్ల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 6, 7 తేదీల్లో యూరప్‌వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.
ఐర్లాండ్, పోలండ్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, బ్రిటన్ సహా మొత్తం 15 దేశాల్లో పౌర సంఘాలు, స్థానిక సంస్థలు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నట్లు ప్రకటించాయి.
ఆందోళనకారులు కేవలం పర్యావరణ సమస్యలనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డేటా సెంటర్లను నిఘా వ్యవస్థలు, యుద్ధ కార్యకలాపాలు, ఇతర హానికర ప్రయోజనాలకు ఉపయోగించే ప్రమాదముందని ఆరోపిస్తున్నారు.
నిర్మాణ పనులను నిలిపివేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలు నిరసనకారుల అభిప్రాయాలేనని గుర్తించాలి.
ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి స్పందించారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేసే హక్కును గౌరవిస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో చట్టవ్యతిరేక చర్యలను, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలను సమర్థించబోమని స్పష్టం చేశారు.
ఇటలీలోని లొంబార్డీ ప్రాంతంలోనూ డేటా సెంటర్ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
మొత్తంగా యూరప్‌లో డేటా సెంటర్ల విస్తరణతో పాటు విద్యుత్తు వినియోగం, నీటి అవసరాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి.
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌పై ఆందోళనకారుల నిరసన.. ఆమ్‌స్టర్‌డాంలో ఉద్రిక్తత, 200 మంది వరకు అదుపులోకి!
9
Published: 📅
Reported by: 🖊
Sarika Sk