హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళల్లో అధిక శబ్ధంతో మైకులు వినిపించడంపై ప్రముఖ నటుడు అల్లు శిరీశ్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ సొసైటీ సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి లౌడ్ మ్యూజిక్ వస్తోందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రతిరోజూ రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు మితిమీరిన శబ్ధంతో మైకులు మోగిస్తున్నారని ఆరోపించారు.
ఈ సమస్యపై గతంలోనే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీశ్ తెలిపారు. అయితే, వినాయక నిమజ్జనం పూర్తయ్యే వరకు సర్దుకుపోవాలని పోలీసులు సూచించినట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 25న గణేశ్ నిమజ్జనం పూర్తయినప్పటికీ ఆలయం వద్ద మైకుల శబ్ధం తగ్గలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి సమయంలో మైకుల నుంచి వస్తున్న భారీ శబ్ధం కారణంగా స్థానికంగా నివసించే వృద్ధులు, చిన్నపిల్లలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అల్లు శిరీశ్ పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రివేళ నిద్రకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యపై సరైన స్పందన కనిపించలేదని ఆయన అన్నారు.
ఇప్పటికైనా అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని అల్లు శిరీశ్ కోరారు. అర్ధరాత్రి సమయంలో అధిక శబ్ధం వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యంపై అధికారులు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అర్ధరాత్రి మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ పోలీసులకు ఫిర్యాదు
6