వరంగల్–కరీంనగర్ మధ్య ప్రయాణికులకు త్వరలో భారీ ఉపశమనం లభించనుంది. రెండు ప్రధాన నగరాలను అనుసంధానించే నేషనల్ హైవే-563 నాలుగు లైన్ల రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.1,641 కోట్ల నిర్మాణ వ్యయంతో 68.015 కిలోమీటర్ల మేర ఈ హైవేను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ట్రయల్ రన్స్ కొనసాగుతుండగా, దసరా సమయానికి అధికారికంగా ప్రారంభించేందుకు నేషనల్ హైవే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ హైవే అందుబాటులోకి వస్తే వరంగల్ నుంచి కరీంనగర్‌కు ప్రస్తుతం గంటన్నర వరకు పట్టే ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రత కోసం అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ప్రతి రెండు కిలోమీటర్లకు 360 డిగ్రీల కెమెరాలు, డిజిటల్ హెచ్చరిక బోర్డులు, సోలార్ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్స్‌లు, క్రేన్లు, రూట్ పెట్రోలింగ్ వాహనాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
ఈ రహదారి కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా వరంగల్, కరీంనగర్ జిల్లాల ఆర్థికాభివృద్ధికి కూడా కీలకంగా మారనుంది. గ్రానైట్ పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులు, టెక్స్‌టైల్ రంగం, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కేంద్రాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు మామునూరు విమానాశ్రయానికి చేరుకోవడం కూడా సులభం కానుంది. అయితే కొన్ని గ్రామాల వద్ద అండర్‌పాస్‌లు లేకపోవడం వల్ల స్థానికులు అదనపు దూరం ప్రయాణించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్–కరీంనగర్ మధ్య ఇక రయ్ రయ్.. గంటలోపే ప్రయాణం!
0
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati