ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లను ప్రోత్సహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నగదు బహుమతులను ప్రకటించారు. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు రజత పతకం అందించిన జట్టులో ఉన్న తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లకు చెరో రూ.50 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
తమిళనాడు సీఎం కార్యాలయం ఎక్స్ వేదికగా అథ్లెట్ల ప్రతిభను ప్రశంసిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. నలుగురు సభ్యులతో కూడిన భారత మిక్స్‌డ్ రిలే జట్టులో తమిళనాడుకు చెందిన ఇద్దరు అథ్లెట్లు ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
విద్య రామరాజ్, విశాల్‌లు తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (SDAT)కి చెందిన ‘ఎలైట్ స్పోర్ట్స్‌పర్సన్ స్కీమ్’ కింద ఆర్థిక సహాయం పొందనున్నారు. వీరి విజయం క్రీడల్లో రాణించాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం విజయ్ పేర్కొన్నారు.
4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో విద్య రామరాజ్, విశాల్, మను, పూవమ్మ కలిసి భారత్ తరఫున పోటీ చేశారు. భారత్ 3:14.46 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకం సాధించింది. బహ్రెయిన్ 3:12.87 సెకన్లతో స్వర్ణ పతకం గెలుచుకుంది.
ఈ విభాగంలో భారత్‌కు ఇది వరుసగా మూడో ఆసియా క్రీడల పతకం. 2018లో ఈ ఈవెంట్ ప్రారంభమైనప్పుడు భారత్ స్వర్ణం సాధించగా, 2022లో రజతం గెలుచుకుంది. తాజాగా మరోసారి రజత పతకంతో భారత్ తన సత్తా చాటింది.
ఆసియా క్రీడల రజత పతక విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా.. చెరో రూ.50 లక్షలు
1
Published: 📅
Reported by: 🖊
Kanakadri