సోషల్ మీడియాలో వీడియో కోసం చేసిన ప్రయత్నం పాకిస్థాన్‌లో విషాదానికి దారితీసింది. పులితో టిక్‌టాక్ వీడియో చిత్రీకరిస్తుండగా ఓ యువకుడిపై క్రూరమృగం దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి ప్రముఖ టిక్టాకర్తో పాటు ఫామ్‌హౌస్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.
లాహోర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నోమన్ హసన్ పులితో వీడియో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఇటీవల కహ్నా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ వన్యప్రాణుల పెంపకం కేంద్రానికి వెళ్లాడు.
అక్కడి ఫామ్‌హౌస్‌లో బోనులో ఉన్న పులిని సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. వీడియోలో పాల్గొనాలని అక్కడ పనిచేస్తున్న తల్హా అనే యువకుడిని నోమన్ హసన్ కోరినట్లు కథనం పేర్కొంది.
దీంతో తల్హా పులి దగ్గరకు వెళ్లగా అది ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని నోమన్ హసన్ తన కారులో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు.
అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో తల్హా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దాడి జరిగిన తర్వాత అసలు విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని ABN కథనం పేర్కొంది.
తల్హాను ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో కుక్క దాడి చేసిందని వైద్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే గాయాలను పరిశీలించిన వైద్యులు అవి పులి దాడి కారణంగా ఏర్పడినవిగా గుర్తించినట్లు సమాచారం.
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం టిక్‌టాకర్ నోమన్ హసన్, ఫామ్‌హౌస్ యజమాని ఫయ్యాజ్ అలియాస్ ఫైజీని అరెస్టు చేశారు.
పులిని బోను నుంచి బయటకు తీసుకురావడానికి ఎవరు అనుమతించారు, వీడియో చిత్రీకరణ సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది.
అలాగే తల్హాను పులి దగ్గరకు వెళ్లమనికోరిన పరిస్థితులు, ప్రమాదం జరిగిన తర్వాత ఇచ్చిన సమాచారం వంటి విషయాలు కేసులో కీలకంగా మారాయి.
టిక్‌టాక్ వీడియో కోసం పులిని బయటకు తీసుకొచ్చారు.. యువకుడిపై దాడి, ప్రాణాలు కోల్పోయిన ఫామ్‌హౌస్ ఉద్యోగి!
2
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk