హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. భారీ గణపతి విగ్రహాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ప్రత్యేకంగా పరిశీలనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం భారీ గణపతి నిమజ్జన ట్రయల్స్ చేపట్టారు.
పోలీసులు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ తదితర విభాగాల అధికారులు కలిసి నిమజ్జన మార్గాన్ని పరిశీలించారు. విగ్రహం పొడవు, వెడల్పును బట్టి మార్గంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ వైర్లు, కటౌట్లు, కేబుల్ వైర్లు, విద్యుత్ సంస్థకు చెందిన లైట్లు అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యలను సెప్టెంబర్ 24లోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
భారీ గణపతి నిమజ్జనాన్ని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల్లోపు పూర్తి చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. భక్తుల దర్శనాలకు బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు ప్రకటించారు. గురువారం ఉదయం నుంచి భక్తులు దర్శనాలకు రావద్దని పోలీసులు సూచించారు.
శుక్రవారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ నుంచి గణపతి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం భారీ గణనాథుడిని ఎన్టీఆర్ మార్గంలోని క్రేన్ నంబర్ 5 వద్దకు తరలించి మధ్యాహ్నం 12 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేయనున్నారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల్లోపే ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం
4
Published: 📅
Reported by: 🖊
Sarika Sk