తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తన రాజకీయ లక్ష్యాలపై మాట్లాడిన కవిత, తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు. సీఎం పదవి కేవలం అధికార హోదా కాదని, ఆ పదవికి గౌరవం, హుందాతనం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మాట్లాడిన కవిత సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై విమర్శలు చేశారు. గతంలో ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ఉపయోగించిన పదాలపై కూడా స్పందించారు. ఇకపై ‘తుగ్లక్ చర్యలు’ అని చెప్పాల్సిన అవసరం లేదని, ‘రేవంత్‌రెడ్డిలా ఉన్నావ్’ అంటే చాలని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థులపై కూడా కవిత ఘాటుగా స్పందించారు. హరీశ్‌రావు భార్య తనపై పోటీ చేస్తే స్వాగతిస్తానని ఆమె సవాల్ విసిరారు. తనపై ఎవరో ఒకరు పోటీ చేయడం తప్పదని, అవసరమని భావిస్తే హరీశ్‌రావు రాజకీయాలను పక్కనపెట్టి తన భార్యను రాజకీయాల్లోకి తీసుకురావచ్చని వ్యాఖ్యానించారు.
తాను గతంలో హరీశ్‌రావుపై పోటీ చేస్తానని చెప్పిన మాట వాస్తవమేనని కవిత గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం హరీశ్‌రావు భార్య తనపై పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై ఎవరు పోటీ చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
కవిత చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.
సీఎం కావాలన్న ఆకాంక్షను బయటపెట్టిన కవిత.. హరీశ్‌రావు భార్యపై పోటీకి సవాల్
16