కరీంనగర్ జిల్లాలో అక్టోబర్ ప్రారంభంలోనే వేసవిని తలపించేలా ఎండ తీవ్రత పెరుగుతోంది. సెప్టెంబర్ చివరి వారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కూడా కరీంనగర్ పట్టణంలో 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
తేమ ఎక్కువగా ఉండటం, గాలి తక్కువగా వీయడం వల్ల ఉక్కపోత మరింత ఎక్కువగా అనిపిస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కూలీలు, రైతులు, రోజువారీ పనుల కోసం బయట తిరిగేవారు ఎండ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరిలో డిహైడ్రేషన్, తలనొప్పి, తల తిరగడం, వికారం, బలహీనత, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
వృద్ధులు, చిన్నారులు, బయట ఎక్కువసేపు పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ నీరు తాగడం, సాధ్యమైనంత వరకు మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండటం, నీడలో విశ్రాంతి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఎండ తీవ్రత కారణంగా ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం కూడా పెరిగింది. రాత్రివేళల్లో కూడా ఉక్కపోత కొనసాగుతుండటంతో విద్యుత్ వినియోగం అధికమవుతోంది. మరోవైపు, అధిక ఉష్ణోగ్రతలు వ్యవసాయ పనులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. పొలాల్లో పనిచేయడం కష్టమవడంతో పాటు పంటలపై వేడి ప్రభావం పడుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సూర్య ప్రతాపం.. కరీంనగర్‌లో 36-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు
0
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati