విదేశీ నిధుల నియంత్రణకు సంబంధించిన FCRA సవరణ బిల్లు-2026పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కీలకంగా చర్చించనుంది. ఈ బిల్లు 2026 మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. అనంతరం ఆగస్టు 12న జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు.
కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 18న జరిగింది. ఆ సమావేశంలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ ప్రతినిధులు బిల్లుపై కమిటీకి వివరాలు అందించారు. విదేశీ నిధుల పర్యవేక్షణకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి.
తాజా సమావేశంలో బిల్లులోని వివిధ నిబంధనలు, విదేశీ నిధుల వినియోగం, ఖాతాల నిర్వహణ వంటి అంశాలపై మరింత వివరాలను తెలుసుకోనున్నారు. బిల్లులోని ప్రతిపాదనలపై హోం, న్యాయ శాఖల అధికారులు తమ అభిప్రాయాలను కమిటీకి వివరించనున్నారు.
బిల్లు ప్రతిపాదనల్లో ఒక ముఖ్యమైన అంశం.. FCRA సర్టిఫికెట్‌ను కోల్పోయిన సంస్థలకు సంబంధించిన విదేశీ నిధులు, ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణ, వాటి భవిష్యత్ వినియోగానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నియమించే Designated Authorityకి కొన్ని అధికారాలను కల్పించే ప్రతిపాదన ఉంది.
ఈ సవరణలపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు ఈ ప్రతిపాదనలు ఎన్జీవోలు, మైనార్టీ సంస్థలపై ప్రభావం చూపవచ్చని అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధుల నియంత్రణ, పారదర్శకత, జాతీయ ప్రయోజనాలు మరియు అంతర్గత భద్రతకు సంబంధించిన అవసరాల నేపథ్యంలో మార్పులు ప్రతిపాదించినట్లు పేర్కొంది.
జేపీసీ పరిశీలన అనంతరం బిల్లుపై కమిటీ తన అభిప్రాయాలు, సిఫారసులను వెల్లడించనుంది.
విదేశీ నిధులపై మరింత నిఘా.. FCRA బిల్లుపై జేపీసీ కీలక చర్చ
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan