దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్లో స్వీట్లు, డ్రైఫ్రూట్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది. పండుగ వేళ బంధుమిత్రులకు బహుమతులుగా స్వీట్లు, డ్రైఫ్రూట్స్ అందించే సంప్రదాయం కొనసాగుతుండటంతో నగరంలోని మిఠాయి దుకాణాలకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు 20 శాతానికి పైగా పెరిగినట్లు వ్యాపారులు వెల్లడించారు.
ఈ దీపావళి సీజన్లో హైదరాబాద్లో సుమారు 3,000 నుంచి 3,500 టన్నుల స్వీట్లు అమ్ముడయ్యే అవకాశముందని ప్రముఖ స్వీట్స్ దుకాణాల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత కొనుగోళ్లతో పాటు కార్పొరేట్ సంస్థల నుంచి కూడా భారీగా ఆర్డర్లు వస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా ఈసారి సోన్ పాపిడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నగరంలోని ఓ ప్రముఖ మార్ట్ దీపావళి కోసం ఏకంగా 55 టన్నుల సోన్ పాపిడిని ఆర్డర్ చేయగా, సరఫరాదారు కేవలం 25 టన్నులు మాత్రమే అందించగలిగినట్లు సమాచారం.
సోన్ పాపిడి తర్వాత మిక్స్డ్ స్వీట్లు, మోతీచూర్ లడ్డూలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. కొన్ని దుకాణాల్లో మొత్తం అమ్మకాల్లో 30 నుంచి 40 శాతం వరకు మోతీచూర్ లడ్డూలే ఉంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
రసగుల్లా, బేసన్ లడ్డూలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈసారి సాధారణ డ్రైఫ్రూట్స్ బాక్సుల కంటే జీడిపప్పు, బాదంతో తయారుచేసిన స్వీట్లను బహుమతులుగా ఇచ్చేందుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
అయితే గతేడాదితో పోలిస్తే స్వీట్ల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. పంచదార ధర 17 శాతానికి పైగా పెరగడం, గ్యాస్, ఇతర ముడిసరుకుల ఖర్చులు అధికమవడం ఇందుకు కారణమని వ్యాపారులు పేర్కొన్నారు.
ఆన్లైన్ డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లు కూడా పండుగ కొనుగోళ్లకు ఊతమిస్తున్నాయి. ధరలు పెరిగినప్పటికీ స్వీట్లు, డ్రైఫ్రూట్స్కు డిమాండ్ కొనసాగుతుండటంతో వ్యాపారులు ఈసారి రికార్డు స్థాయి అమ్మకాలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దీపావళికి స్వీట్ల అమ్మకాల జోరు.. హైదరాబాద్లో 3,500 టన్నుల విక్రయాల అంచనా, ధరలు పెరిగినా తగ్గని డిమాండ్!
16
Published: 📅
Reported by: 🖊
Kanakadri