తుఫాన్ తీవ్రత, భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఇప్పటికే ముసురు వాతావరణం కొనసాగుతోందని, మధ్యాహ్నం తర్వాత వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలకు) సూచించారు.
మరోవైపు, వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాల ప్రజలను, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.
ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అత్యవసర సమాచారం కోసం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల కోసం 08942 240557 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తుఫాన్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవులు
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan