వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో వర్షాలు, ఈదురుగాలుల పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు నేడు, రేపు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
24 గంటల పాటు కంట్రోల్ రూంలను అందుబాటులో ఉంచాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని హోంమంత్రి అధికారులకు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా చెట్లు, భారీ హోర్డింగ్స్, శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వం జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని హోంమంత్రి స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గే వరకు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా వర్షాలు, బలమైన గాలుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.
వాయుగుండంతో సర్కార్ అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
13
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk