కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి స్పష్టమైన రాజకీయ మార్పు కనిపించింది. మొత్తం 140 స్థానాల్లో యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించి భారీ మెజారిటీతో అధికారానికి చేరువైంది. గత ఎన్నికల్లో 62 స్థానాలు గెలిచిన ఎల్డీఎఫ్ ఈసారి 35 స్థానాలకు పరిమితం కావడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
మరోవైపు భాజపా కూడా కేరళలో పదేళ్ల తర్వాత మళ్లీ ఖాతా తెరిచింది. నేమోం చాతన్నూర్ కాళకూటం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. నేమోంలో రాజీవ్ చంద్రశేఖర్ 4,978 ఓట్ల తేడాతో గెలిచారు. చాతన్నూర్ లో బీబీ గోపకుమార్ 4,398 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాళకూటంలో వి మురళీధరన్ కేవలం 428 ఓట్ల తేడాతో గట్టెక్కారు.
భాజపాకు ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్ సీపీఎం చేసిన వ్యాఖ్యలకు ఈ ఫలితాలే సమాధానమని భాజపా కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అయితే కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తాను పోటీ చేసిన కంజిరప్పల్లిలో మూడో స్థానంలో నిలవడం ఆ పార్టీకి మిశ్రమ సంకేతంగా మారింది.
కేరళలో భాజపా తొలిసారి 2016లో నేమోం నుంచి గెలిచింది. 2021లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఆ పార్టీ వెనుకబడింది. ఇప్పుడు మూడు స్థానాలతో తిరిగి రావడం రాజకీయంగా గమనించాల్సిన పరిణామం.
అయితే ఈ ఎన్నికల ప్రధాన చిత్రం యూడీఎఫ్ విజయం. 102 స్థానాలతో స్పష్ట ఆధిక్యం రావడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మొదలైంది. పినరయి విజయన్ ధర్మదం నుంచి 19,247 ఓట్ల తేడాతో గెలిచినా ఎల్డీఎఫ్ ఓటమి ఆయన నాయకత్వానికి పెద్ద రాజకీయ సవాల్ గా నిలిచింది.
కేరళలో యూడీఎఫ్ దూకుడు భాజపా ఖాతా తెరిచింది
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan