బిహార్లోని బెగుసరాయ్ జిల్లాలో సామూహిక అత్యాచార బాధితురాలిపై మరోసారి దాడి జరిగిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐదు నెలల క్రితం అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేసిన 30 ఏళ్ల మహిళను ఇద్దరు వ్యక్తులు భవనంపై నుంచి కిందకు తోసేశారని ఆరోపణలు వెలువడ్డాయి.
సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బాధితురాలు సుమారు 12 నుంచి 15 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
జూన్లో నమోదైన సామూహిక అత్యాచార కేసును వెనక్కి తీసుకోవాలని నిందితులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజీకి రావాలంటూ పలుమార్లు బెదిరించారని తెలిపారు.
ఈ బెదిరింపులపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబం ఆరోపిస్తోంది.
తాజా ఘటనపై బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఇద్దరిపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భోంగల్ కుమార్ అలియాస్ భోంగల్ మహతోను అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం జూన్లో రాత్రివేళ ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు వచ్చిన ఆమె భర్తను గదిలో బంధించినట్లు ఆరోపణలున్నాయి.
ఆ ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్య పరీక్షల్లో ఆమె శరీరం నుంచి పలు వస్తువులను తొలగించాల్సి వచ్చినట్లు వార్తా కథనం పేర్కొంది.
మొదటి కేసులో ఐదుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఐదో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
కేసు నమోదైన మూడు నెలల తర్వాత కూడా కొందరు వ్యక్తులు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి దాడికి ప్రయత్నించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ ఘటనపై బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ స్పందించారు. మహిళల భద్రత, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇప్పటికే తీవ్రమైన నేరానికి బాధితురాలైన మహిళకు పదేపదే బెదిరింపులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేశారు.
బిహార్లో దారుణం.. అత్యాచార కేసు వెనక్కి తీసుకోవాలంటూ బాధితురాలిపై మరోసారి దాడి, మేడపై నుంచి తోసేసిన నిందితులు!
4
Published: 📅
Reported by: 🖊
Banu Prakash