బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, క్రమంగా బలపడి నవంబర్ 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
దక్షిణ అండమాన్ దీవులకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసింది.
అనంతరం ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 14 నాటికి తీవ్ర అల్పపీడనంగా, నవంబర్ 15 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని అధికారులు వివరించారు.
మరోవైపు మన్నార్ జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో సుమారు 900 మీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాలకు వర్ష సూచనలు జారీ చేశారు. నవంబర్ 12న తంజావూరు, తిరువారూరు, మైలాడుదురై, నాగపట్టినం, పుదుకోట, రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
అలాగే పశ్చిమ కనుమల పరిధిలోని జిల్లాలు, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో సాధారణంగా పొడి వాతావరణం కొనసాగవచ్చని పేర్కొన్నారు.
నవంబర్ 13న పశ్చిమ కనుమల జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు.
మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నందున సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబర్ 12 రాత్రిలోగా తీరానికి తిరిగి రావాలని సూచించారు.
నవంబర్13 నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.వాతావరణ వ్యవస్థ బలపడే కొద్దీ సముద్ర పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అధికారిక హెచ్చరికలను పాటించాలని సూచించారు
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ముప్పు.. నవంబర్ 15న తీవ్రత పెరిగే అవకాశం, తమిళనాడుకు వర్ష సూచన!
6