sit formed in moinabad farmhouse drugs case

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. సిట్ ఏర్పాటు

6

Published on: 📅 18 Mar 2026, 09:11 AM
Reporter: 🖊 Anitha Sharma

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. మొత్తం 9 మంది అధికారులతో ఈ సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ సుధీర్‌బాబు పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగనుంది.


భారాస నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన మద్యం పార్టీ వివాదానికి దారి తీసింది. అక్కడ డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న సమాచారంతో తెలంగాణ ఈగల్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 11 మందిని పరీక్షించగా, ఆరుగురికి డ్రగ్స్ వినియోగం పాజిటివ్‌గా నిర్ధారణైంది. వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, పైలట్ రోహిత్‌రెడ్డి ఉన్నారు.


దాడి సమయంలో నమిత్‌శర్మ అనే వ్యక్తి కాల్పులకు పాల్పడిన ఘటన మరింత సంచలనంగా మారింది. ఈ కాల్పులు రోహిత్‌రెడ్డి ఆదేశాలతో జరిగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో 11 మందిపై కేసులు నమోదు చేశారు.


రోహిత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు ఆయనతో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. అనంతరం నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Sponsored