saudi oil output hit hard despite ceasefire middle east tensions persist

సౌదీ చమురు ఉత్పత్తికి భారీ దెబ్బ.. సీజ్‌ఫైర్ మధ్య కొత్త టెన్షన్

11

Published: 📅
Reported by: 🖊 Eswar Pavan

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా పశ్చిమాసియాలో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా, చమురు రవాణా మార్గాలు, ఉత్పత్తి కేంద్రాలపై దాడులు కొత్త ఆందోళన కలిగిస్తున్నాయి. యుద్ధం ఆగినట్టు కనిపించినా, నేలమీద ఉద్రిక్తత మాత్రం ఇంకా తగ్గలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా తనకు జరిగిన నష్టాన్ని అధికారికంగా బయటపెట్టింది. రియాద్, యాన్బు, రాస్ తనురా, జుబైల్ వంటి కీలక శక్తి, రిఫైనరీ, రవాణా కేంద్రాలు దెబ్బతిన్నాయని తెలిపింది. సౌదీ ప్రకటన ప్రకారం దాడుల వల్ల దేశ చమురు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు సుమారు 6 లక్షల బ్యారెళ్లు తగ్గింది. అలాగే హర్మూజ్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా కీలకమైన ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ప్రవాహం రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్ల మేర తగ్గింది. ఇది కేవలం సౌదీ సమస్య కాదు, ప్రపంచ చమురు సరఫరాలకే హెచ్చరిక.

సౌదీ ఇంకా ఒక విషయంపై జాగ్రత్తగా నడిచింది. దాడులు జరిగాయని, భారీ నష్టం వాటిల్లిందని చెప్పినా, అధికారికంగా ఎవరినీ నేరుగా బాధ్యులుగా ప్రకటించలేదు. కానీ రాయిటర్స్ నివేదికల ప్రకారం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ యాన్బు సహా శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసామని ప్రకటించాయి. అంటే అధికారిక ఆరోపణల కన్నా, ప్రదేశంలో యుద్ధ సంకేతాలు ఇంకా కొనసాగుతున్నాయన్న మాట.

మరోవైపు కువైట్ కూడా పరిస్థితి సీరియస్‌గానే ఉందని చెబుతోంది. ఇటీవల డ్రోన్ దాడుల్లో ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్, పవర్ యూనిట్లు, నీటి డీసాలినేషన్ కేంద్రాలు దెబ్బతిన్నాయని కువైట్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 1న కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంధన ట్యాంకులపై కూడా డ్రోన్ దాడి జరిగి అగ్నిప్రమాదం సంభవించినట్లు రాయిటర్స్ తెలిపింది. కాబట్టి సీజ్‌ఫైర్ ఉన్నా, ఇరాన్ అనుకూల శక్తుల ముప్పు పూర్తిగా తగ్గలేదని కువైట్ సందేశం ఇస్తోంది.

ఆంధ్రప్రదేశ్