raghav chadha hits back at aap with dhurandhar dialogue

‘గాయపడ్డాను.. అందుకే మరింత దృఢమయ్యాను’.. ఆప్‌కు రాఘవ్‌ చడ్డా గట్టి సమాధానం

13

ఆమ్‌ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ ఘర్షణ స్థాయికి చేరాయి. రాజ్యసభలో పార్టీ ఉపనేత హోదా నుంచి తొలగించిన తర్వాత రాఘవ్‌ చడ్డా మౌనంగా ఉండకుండా, పార్టీ అధిష్ఠానంపైనే నేరుగా ఎదురుదాడి చేశారు. “గాయపడ్డా.. అందుకే మరింత దృఢమయ్యా” అనే డైలాగ్‌తో ఆయన ఇచ్చిన స్పందన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

చడ్డా తనపై నడుస్తున్నది సహజ రాజకీయ విమర్శ కాదని, ముందుగానే సిద్ధం చేసిన ప్రచారమని అన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నదికాదని, పథకం ప్రకారమే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనను బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నా, తాను వెనక్కి తగ్గబోనన్న సంకేతాన్ని ఇచ్చారు.

తనపై మూడు ప్రధాన ఆరోపణలు చేసినట్లు చడ్డా తెలిపారు. మొదటిది — ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు తాను బయటకు రాలేదన్నది. రెండోది — ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై తాను సంతకం చేయడానికి నిరాకరించానన్నది. మూడోది — ప్రధాని నరేంద్ర మోదీకి భయపడి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం తగ్గించానన్నది. ఈ మూడు ఆరోపణల్లో ఒక్కదాంట్లోనూ నిజం లేదని చడ్డా తేల్చిచెప్పారు.

తాను పార్లమెంట్‌కు వెళ్తుందే ప్రజా సమస్యల కోసం అని కూడా అన్నారు. జీఎస్టీ, పంజాబ్‌ నీటి సమస్య, భారత రైల్వేలో ఇబ్బందులు, సామాన్య ప్రజల సమస్యలను ఎన్నోసార్లు సభలో లేవనెత్తానని చెప్పారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తన పని గానీ, గందరగోళం సృష్టించడం కాదని పేర్కొన్నారు.

మరోవైపు ఆప్‌ కూడా వెనక్కి తగ్గలేదు. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరించారన్న ఆరోపణలతోనే చడ్డాపై చర్యలు తీసుకున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే ఆయనను రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తీసేసి, అశోక్‌ మిత్తల్‌ను ఆ స్థానంలో నియమించింది. ఇదే నిర్ణయం ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారింది.

మొత్తానికి రాఘవ్‌ చడ్డా స్పందన ఒక విషయం స్పష్టం చేస్తోంది. ఆయన దీనిని కేవలం పదవి కోల్పోవడంగా చూడడం లేదు. తనను లక్ష్యంగా చేసుకున్న రాజకీయ చర్యగా భావిస్తున్నారు. “గాయపడ్డా.. మరింత దృఢమయ్యా” అనే డైలాగ్‌తో ఆయన ఇచ్చిన కౌంటర్‌ ఇప్పుడు ఆప్‌లోని అంతర్గత పోరాటాన్ని మరింత బహిర్గతం చేసింది.

ఆంధ్రప్రదేశ్